ఏసీ, కూలర్ కొంటున్నారా..?
సమ్మర్ వచ్చేసింది. ఎండలు ఇప్పుడే భగ్గుమంటున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎయిర్ కండీషనర్లు (AC), ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లకు డిమాండ్ పెరిగింది. అయితే వీటిని కొనేముందు కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
ఏసీ:
ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఎయిర్ కండిషనర్లు (ఏసీ), ఇప్పుడు తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. అయితే, సరైన ఏసీ కొనుగోలు చేయకపోతే, అధిక విద్యుత్తు బిల్లు కట్టాల్సి వస్తుంది. పైగా గది వెంటనే చల్లబడక ఇబ్బందిపడాల్సి ఉంటుంది.
ఏసీల్లో చాలా రకాలుంటాయి..
విండో ఏసీ : సింగిల్ రూమ్లో ఉండేవారు వీటిని ఎక్కువగా వాడతారు.
ఈ విండో ఏసీలో అన్ని పరికరాలు ఒకే బాక్స్ లో అమర్చి ఉంటాయి. దీన్ని బిగించడం కూడా చాలా సులభం. కిటికీలో లేదా గోడకు ఉండే ఓపెనింగ్ లో దీన్ని అమర్చవచ్చు. కాకపోతే కాస్త శబ్దం ఎక్కువగా వస్తుంది.
స్ల్పిట్ ఏసీ : పేరుకు తగ్గట్లుగానే ఈ స్ల్పిట్ ఏసీలో రెండు పరికరాలు విడివిడిగా ఉంటాయి. ఒక దాన్ని ఇంట్లో బిగిస్తే, మరొక దాన్ని వెలుపల అమర్చాల్సి ఉంటుంది. కంప్రెసర్ అనేది బయట అమర్చే భాగంలో ఉంటుంది. అందువల్ల శబ్దం పెద్దగా రాదు.
హాట్ అండ్ కోల్డ్ ఏసీ : అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు ఈ ఏసీ అనుకూలంగా ఉంటుంది. ఈ హాట్ అండ్ కోల్డ్ ఏసీ అనేది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు గదిని చల్లబరుస్తుంది. శీతాకాలంలో మంచి వెచ్చదనాన్నీ అందిస్తుంది.
పోర్టబుల్ ఏసీ : మీ అవసరానికి అనుగుణంగా ఈ పోర్టబుల్ ఏసీని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
టవర్ ఏసీ : పెద్ద గదులను, కమర్షియల్ ప్లేస్లను వేగంగా చల్లబరిచేందుకు ఈ టవర్ ఏసీలను ఉపయోగిస్తూ ఉంటారు.
గదిని బట్టి ఎంపిక:
మీరు ఉంటున్న ఇల్లు లేదా గదికి అనుగుణంగా సరైన ఏసీ తీసుకోవాలి. పిల్లల గది, మాస్టర్ బెడ్రూం, లివింగ్ రూమ్, ఇలా మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి ఏసీ రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 120 చదరపు అడుగుల కంటే తక్కువ వైశాల్యం ఉన్న గది అయితే ఒక టన్ను సామర్థ్యం ఉన్న ఏసీ సరిపోతుంది. అలాగే 120-200 చ.అడుగులకు 1-2 టన్నులు, లివింగ్ రూం లేదా 200 చ.అడుగుల కంటే పెద్దగా ఉండే గదులకు రెండు టన్నులు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకోవాలి.
ఫీచర్స్
ఏసీలో కచ్చితంగా ఎయిర్ ఫిల్టర్లు ఉండాలి. అప్పుడే ఏసీలోకి ఎలాంటి దుమ్ము, ధూళి చేరదు. ఫలితంగా అలర్జీల వంటివి దరిచేరకుండా ఉంటాయి.
ఆటో క్లీన్ ఫీచర్ ఉన్న ఏసీ తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఏసీ దానికదే శుభ్రం చేసుకుంటుంది. ఫలితంగా బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పట్టకుండా ఉంటాయి. ఏసీలో డీహ్యుమిడిఫికేషన్ ఫీచర్ ఉండాలి. అప్పుడే గదిలో తేమ, తడి నిండిపోకుండా ఉంటుంది. వీటితో పాటు ఏసీలో స్మార్ట్ కనెక్టివిటీ, ఆటో స్టార్ట్, ఫోర్-వే స్వింగ్, టర్బో మోడ్, స్లీప్ అలార్మ్ సహా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లాంటి ఫీచర్లు కూడా ఉండేలా చూసుకోవాలి.
రేటింగ్
అన్ని ఏసీల సామర్థ్యం ఒకేలా ఉండదు. అలాగే విద్యుత్తును వాడుకునే విషయంలోనూ వాటిలో తేడాలుంటాయి. అందుకే స్టార్ రేటింగ్ ఉన్న ఏసీనే ఎంచుకోవాలి. ఒక స్టార్ ఉన్న ఏసీతో పోలిస్తే 4, 5 స్టార్ రేటింగ్ కలిగిన వాటిని ఎంచుకోవడం చాలా మంచిది. దీని వల్ల మీ విద్యుత్ బిల్లు ఆదా ఆవుతుంది.
కూలర్
ఏసీల్లో రకాలు ఉన్నట్టుగానే ఎయిర్ కూలర్ లో కూడా వేర్వేరు రకాలుంటాయి. పర్సనల్ కూలర్, విండో కూలర్, డిసర్ట్ కూలర్ అని ఉంటాయి. మీ గది చిన్నగా ఉన్నా, ఇంట్లో ఒకరిద్దరు మాత్రమే ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేప్పుడు ఉపయోగించాలన్నా పర్సనల్ కూలర్ సరిపోతుంది. బెడ్రూమ్లో లేదా హాల్లో కిటీకీ దగ్గర్లో పెట్టాలనుకుంటే విండో ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. మీ రూమ్ సైజ్ పెద్దగా ఉంటే డిసర్ట్ కూలర్ తీసుకోవడం మేలు. డిసర్ట్ కూలర్ పెద్ద గది మొత్తాన్ని కవర్ చేస్తుంది. వాటర్ కెపాసిటీ కూడా చూడాలి. చిన్న రూమ్కు 15 నుంచి 25 లీటర్లు, మీడియం సైజ్ గదికి 25 నుంచి 40 లీటర్లు, పెద్ద హాల్ కోసం 40 లీటర్ల కన్నా ఎక్కువ వాటర్ కెపాసిటీ ఉన్న కూలర్ ఎంచుకోవాలి. కూలర్కు ఆటో ఫిల్ ఆప్షన్ ఉంటే మంచిది. ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వదిలేస్తే ఆటోమెటిక్ గా నీళ్లు వస్తాయి. కొన్నిటిలో ఐస్ ఛాంబర్స్ కూడా ఉంటాయి. కూలర్ నుంచి సౌండ్ ఎంత వస్తుందో తెలుసుకోవడానికి నాయిస్ లెవెల్ ఎంతో చెక్ చేయాలి. మీ ఏరియాలో పవర్ కట్స్ ఎక్కువగా ఉంటే ఇన్వర్టర్ టెక్నాలజీ సపోర్ట్ చేసే ఎయిర్ కూలర్ ఎంచుకోవాలి.
.jpg)
No comments:
Post a Comment